టాయ్ లెట్‌లో భోజనం గిన్నెలు.. ఆటగాళ్లకు అక్కడే తినిపించారు

Players served food kept on toilet floor in Saharanpur sports complex

By అంజి  Published on  20 Sep 2022 10:15 AM GMT
టాయ్ లెట్‌లో భోజనం గిన్నెలు.. ఆటగాళ్లకు అక్కడే తినిపించారు

మన దేశంలో క్రికెటేతర ఆటలపై ఎంత చిన్న చూపు చూపుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది విషయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇతర ఆటలు ఆడే వారిని కనీసం మనుషులుగా కూడా చూడరు. తాజాగా కబడ్డీ ఆటగాళ్లకు టాయ్ లెట్ లో భోజనానికి సంబంధించిన గిన్నెలను ఉంచి వారికి అందించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో నేలపై ఉంచిన ఆహారాన్ని కబడ్డీ ఆటగాళ్లకు అందించారు. అందుకు సంబంధించిన నివేదికలు రావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహరాన్‌పూర్‌లోని జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్ చేసింది.

సహరన్‌పూర్‌లోని స్పోర్ట్స్ స్టేడియంలో టాయిలెట్ కాంప్లెక్స్ లో వండిన అన్నంతో నిండిన పెద్ద ప్లేట్‌ను ఉంచినట్లు వీడియోలు చూపించాయి. మూడు రోజుల రాష్ట్రస్థాయి U-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనే సుమారు 200 మంది క్రీడాకారులకు అన్నం అందించబడింది. కానీ ఇలా టాయ్ లెట్ లో ఉంచి వారికి అక్కడే భోజనం పెట్టడం చాలా దారుణమని విమర్శలు వచ్చాయి. ఇక క్రీడాకారులకు అందించే ఆహారంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిసింది. దీంతో జిల్లా క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేసినట్లు సహరాన్‌పూర్ డీఎం తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.


Next Story