ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము చేత ఓపెనింగ్ చేసేలా లోక్‌సభ సెక్రటేరియేట్, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ సీఆర్ జయ సుకిన్ ఈ పిటిషన్ ఫైల్ చేశారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ సెర్మనీలో రాష్ట్రపతి పేరును చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు ఆ పిల్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్ అనేది సుప్రీం లెజిస్టేటివ్ సంస్థ అని, పార్లమెంట్‌లో రాష్ట్రపతి, ఉభయసభలు కూడా ఉంటాయని పిటీషన్‌లో తెలిపారు.
ఉభయసభలకు సమన్లు జారీ చేసే, ప్రొరోగ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని ఆ పిల్‌లో చెప్పారు. రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అసంబద్ధంగా ఉందన్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, ప్రతి ఒక్క ఎంపీని ఆహ్వానిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఎవరి మనోభావాలకు తగ్గట్టుగా వారు నడుచుకుంటారని, ఈ కార్యక్రమానికి రావాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది విపక్షాలేనని అన్నారు.