సామాన్యులపై మరింత భారం.. పెట్రోల్ కు బ్రేకులే పడట్లేదు..
Petrol, diesel prices up 25 paise per litre each. వరుసగా పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయి.
By Medi Samrat Published on 12 May 2021 6:18 AM GMT
లాక్ డౌన్ కష్టాల్లో ఎంతో మంది ఉన్న సంగతి తెలిసిందే..! సరైన ఆదాయం లేక.. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమయాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూ వెళ్తుండడం సామాన్యులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతూ ఉంది. వరుసగా పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయి. సోమవారం నుంచి మళ్లీ ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల మొదలైంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం పెట్రోల్ లీటర్ 22 నుంచి 25 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 24 నుంచి 27 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.05, డీజిల్ 82.61 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 98.36 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 89.75 పైసలకు చేరింది.
మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే మే 4 నుంచి పెట్రోల్-డీజిల్ లపై బాదుడు మొదలైంది. ఈ ధరల బాదుడు ఫలితంగా చాలా పట్టణాల్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను చేరుతున్నాయి. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73 పైసలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని నగరాబంధ్‌లో లీటర్ పెట్రోల్ 103 రూపాయలను దాటింది. పెట్రోల్ లీటర్ 103.21 పైసలుగా నమోదైంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ 102.96 పైసలకు చేరింది.