ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును 'పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం'గా పేరు మార్చింది. ఈ పథకానికి రూ.లక్షా 51 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఉపాధి రోజుల సంఖ్యను కూడా ప్రభుత్వం 125 రోజులకు పెంచింది. అంతేకాకుండా, కనీస వేతనాన్ని రోజుకు రూ.240కి సవరించారు. ఈ పథకాన్ని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (NREGA) పేరుతో ప్రారంభించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాలలో ఇది ఒకటి. తరువాత దీనిని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) గా మార్చారు. సామాజిక భద్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్మిక చట్టం ఇది. గ్రామీణ భారతదేశంలో నైపుణ్యం లేని పౌరులకు జీవనోపాధి భద్రతను పెంచడం దీని ప్రాథమిక లక్ష్యం. దీని నియమాల ప్రకారం, ప్రతి ఇంటి నుండి పని చేయడానికి సిద్ధంగా ఉన్న పెద్దలకు కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కేంద్రం అందిస్తుంది.