రోగికి గుండెపోటు.. క్ష‌ణాల్లో స్పందించిన వైద్యుడు.. వీడియో వైర‌ల్‌

Patient Collapses After Heart Attack Doctor Saves Life By Giving CPR.వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఓ వ్య‌క్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2022 6:00 AM GMT
రోగికి గుండెపోటు.. క్ష‌ణాల్లో స్పందించిన వైద్యుడు.. వీడియో వైర‌ల్‌

వైద్యో నారాయ‌ణో హ‌రి అంటుంటారు. అంటే.. వైద్యుడు దేవుడితో సమానం అని దీని అర్థం. ఈ ఘ‌ట‌నను చూస్తే ఇది నిజ‌మేన‌ని అనిపించ‌క‌మాన‌దు. వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఓ వ్య‌క్తి గుండెపోటుతో కుప్ప‌కూలిపోయాడు. అది గ‌మ‌నించిన వైద్యుడు క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా సీపీఆర్ చేసి అత‌డి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘ‌ట‌న మహారాష్ట్రలో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. కొల్హాపూర్‌కు చెందిన అర్జున్ అద్నాయక్ కార్డియాలజీ స్పెషలిస్ట్. గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఓ రోగి చెక‌ప్ కోసం అర్జున్ వ‌ద్ద‌కు వ‌స్తుండేవాడు. చాలా ఏళ్ల కింద‌ట అమ‌ర్చిన పేస్ మేక‌ర్‌ను భ‌ర్తీ చేయించుకోవాల‌ని వ‌చ్చాడు. డాక్ట‌ర్‌కు ఎదురుగా ఉన్న‌కుర్చిలో కూర్చోని ఉండ‌గా.. గుండెపోటు వ‌చ్చింది.

దీంతో కుర్చీలోనే కింద‌కు వాలిపోయాడు. గ‌మ‌నించిన అర్జున్.. క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా త‌న కుర్చీలోంచి లేచి అత‌డి వ‌ద్ద‌కు వ‌చ్చి సీపీఆర్ చేశాడు. ఆ వ్య‌క్తి సాధార‌ణ స్థితికి వ‌చ్చాడు. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డి సీసీటీవీలో రికార్డైంది.

"మ‌న మ‌ధ్య‌లోనే రియ‌ల్ హీరోలు జీవిస్తారు అని చెప్పేందుకు ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. డాక్ట‌ర్ అర్జున్ అద్నాయ‌క్ కొల్హాపూర్‌లోనే గొప్ప కార్డియాల‌జిస్ట్‌. ఇలాంటి గౌర‌వ‌నీయులు, మంచి వ్య‌క్తుల‌కు నా అభినంద‌న‌లు." అంటూ ఎంపీ ధనంజయ్ మహదిక్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో డాక్ట‌ర్ అర్జున్‌ను మెప్పుకుంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story