పతంజలికి షాకిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
Patanjali Clarifies On Coronil Certification WHO Says Not Reviewed. కరోనా నివారణకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రచారంలో ఉన్న పతంజలి సంస్థ వారి కొరొనిల్ మరో వివాదంలో చిక్కుకుంది.
By Medi Samrat Published on 22 Feb 2021 12:43 PM IST
కరోనా నివారణకు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రచారంలో ఉన్న పతంజలి సంస్థ వారి కొరొనిల్ మరో వివాదంలో చిక్కుకుంది. యోగా గురు బాబా రాందేవ్ ప్రమోట్ చేసిన ఈ మెడిసిన్ సర్టిఫికేట్‌పై అయోమయం నెలకొంది. పతంజలికి సంబంధించి కొరొనిల్‌పై ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పడం పతంజలికి షాక్ ఇచ్చేలా చేసింది. తమ మందు ఆయుర్వేద మూలికలతో తయారైనదని, ఇది కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా నివారిస్తుందని రాందేవ్ బాబా చెబుతున్నారు. ఈనెల 19న కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ హాజరైన ఓ కార్యక్రమంలో దీనిని ఫస్ట్ ఎవిడెన్స్ బెస్ట్ మెడిసిన్ ఫర్ కోవిడ్-19 మందుగా పేర్కొన్నారు.
అంటే ఈ వైరస్‌కు తొలి సమర్ధత మెడిసిన్ అని వివరించారు. దీనికి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా సర్టిఫికేట్ లభించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్ విభాగం గుర్తించిందని బాబా రామ్ దేవ్ అన్నారు. అయితే.. తాము దీనిని రివ్యూ చేయలేదని, అలాగే సాంప్రదాయక మందుగా సర్టిఫై చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా చికిత్సకు సంబంధించి తాము ఎలాంటి మెడిసిన్‌ను సమీక్షించలేదని ట్వీ్ట్ చేసింది.
కానీ ఈ సంస్థ సర్టిఫికేషన్ స్కీమ్ ప్రకారం.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఆయుష్ విభాగం నుంచి ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్ గా సర్టిఫికెట్ పొందిందని బాబా రామ్ దేవ్ తెలిపారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని పతంజలి ఆయుర్వేద ఎగ్జిక్యూటివ్ లలో ఒకరైన రాకేష్ మిట్టల్ తెలిపారు. అయితే కొరొనిల్ విషయంలో అయోమయం లేదని, డీసీజీఐ దీనికి సర్టిఫికెట్ జారీ చేసిందని పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ కూడా తెలిపారు.
అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ మందునూ ఆమోదించబోదని, అదే సమయంలో దేనిని కూడా తిరస్కరించబోదని ఆయన ట్వీట్ చేశారు. కొరొనిల్ మెడిసిన్‌ను విడుదల చేసిన తర్వాత చిక్కుల్లో చిక్కిన పతంజలి.. తాజాగా దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుతులు వచ్చాయని చెప్పినప్పటికీ మరోసారి షాకిచ్చింది డబ్ల్యూహెచ్‌వో. అయితే దీనిపై పతంజలి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.