డ్యూటీ అవర్స్ ముగియడంతో ఫ్లైట్ ఎక్కనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు

ఎయిర్‌ ఇండియా విమానం నిన్న అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఎయిరిండియా ఏఐ-112 విమానం లండన్‌ నుండి ఢిల్లీకి వస్తుండగా

By అంజి
Published on : 26 Jun 2023 6:28 AM

Passengers, Jaipur, Air India plane, pilot duty limit, Delhi airport

డ్యూటీ అవర్స్ ముగియడంతో ఫ్లైట్ ఎక్కనన్న పైలట్.. విమానంలోనే 350 మంది ప్రయాణికులు

ఎయిర్‌ ఇండియా విమానం నిన్న అత్యవసరంగా జైపూర్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఎయిరిండియా ఏఐ-112 విమానం లండన్‌ నుండి ఢిల్లీకి వస్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. అంతా సర్దుకున్నాక విమానం నడిపేందుకు పైలట్‌ నిరాకరించాడు. దీంతో 350 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు విమానంలో ఉండిపోయారు. వాస్తవానికి విమానం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో.. ఎయిర్‌వేస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు దానిని జైపూర్‌కు మళ్లీంచి ల్యాండ్‌ చేశారు. అంతకుముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జైపూర్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయిన రెండు గంటల తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు క్లియరెన్స్‌ వచ్చింది. ఎయిరిండియా విమానంతో పాటు జైపూర్‌కు మళ్లించి మరిన్ని విమానాలకు కూడా ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చింది. కానీ, ఫైలట్‌ మాత్రం విమానాన్ని టేకాఫ్‌ చేసేందుకు నిరాకరించాడు. డ్యూటీ అవర్స్‌ ముగిశాయన్న కారణంతో తాను విమానాన్ని నడపబోనని పట్టుబట్టాడు. దీంతో విమానంలోని 350 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చేసేది లేక ప్రయాణికుల్లో కొందరిని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి తరలించగా, విమాన సిబ్బందిని మార్చిన తర్వాత అదే విమానంలో మిగతా వారిని పంపించారు. జైపూర్‌లో తాము ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి నెట్టింట షేర్‌ చేశారు. అయితే ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటి వరకూ స్పందించలేదు.

Next Story