ప్రయాణికులకు శుభవార్త.. రైలులో న‌చ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు

Passengers can now order food of their choice in trains. భారత్‌లో రోజు లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. ఇక చాలా దూరం ప్రయాణించే వారి

By అంజి  Published on  16 Nov 2022 6:38 AM GMT
ప్రయాణికులకు శుభవార్త.. రైలులో న‌చ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు

భారత్‌లో రోజు లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. ఇక చాలా దూరం ప్రయాణించే వారి కోసం టిక్కెట్లలోనే భోజన సౌకర్యం కూడా కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. అయితే ఇప్పటి వరకు ఒకే మెనూను మాత్రమే అమలు చేస్తూ వచ్చింది. కాగా ఇప్పుడు సరికొత్తగా ప్రయాణికులకు అవసరమైన విధంగా మెనూలో మార్పులు చేసుకునే ఛాన్స్‌ కల్పించింది. ప్రయాణికులు ఇప్పుడు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. స్థానిక, ప్రాంతీయ రుచులతో పాటు మధుమేహ రోగులు, శిశువులకు అవసరమైన ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆరోగ్య‌ప్రియుల కోసం ప్ర‌త్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తీసుకురానున్న‌ది.

దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు ఓ నోట్‌ పంపింది. రైళ్లలో క్యాటరింగ్‌ సేవలను మెరుగుపర్చడం, ఎక్కువ రకాల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా దొరికే చిరుధాన్యాల‌తో చేసే స్థానిక ఉత్ప‌త్తుల‌నూ మెనూలో భాగం చేసుకోవ‌చ్చ‌ని రైల్వేబోర్డు సూచించింది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌లతోపాటు ప్రీపెయిడ్‌ (రాజధాని) రైళ్లలో ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది. మెనూలో మార్పులు చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌డంతో ప్ర‌యాణికులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రైల్వే బోర్డు ప్రకారం.. కొత్త మెనూలో ప్రాంతీయ వంటకాలు ఉంటాయి. ప్యాసింజర్ ఛార్జీలలో క్యాటరింగ్ ఛార్జీలు చేర్చబడిన ప్రీపెయిడ్ రైళ్ల కోసం, మెనూని ఇప్పటికే తెలియజేసిన టారిఫ్‌లోపు ఐఆర్‌సీటీసీ నిర్ణయిస్తుంది.

రైళ్లలో ప్రాంతీయ ఆహారం లేకపోవడంపై ప్రయాణికుల నుంచి నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. మెనూలో ప్రాంతీయ వంటకాలు/ప్రాధాన్యతలు, కాలానుగుణ వంటకాలు, పండుగల సమయంలో ప్రత్యేక వంటకాలు, డయాబెటిక్ ఫుడ్, బేబీ ఫుడ్, మిల్లెట్ ఆధారిత స్థానిక ఉత్పత్తులతో సహా ఆరోగ్య ఆహార ఎంపికలు వంటి వివిధ సమూహాల ప్రయాణీకుల ప్రాధాన్యతల ప్రకారం ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో రైలు సర్వీసుల్లో ఇడ్లీ, ఉప్మా, దోస, నూడుల్స్,రాగి మాల్ట్ ఉంటాయి. అయితే గుజరాత్‌కు వెళ్లే రైలులో ఫాఫ్డా, ధోక్లా, వడా పావ్ వంటి స్థానిక వంటకాలు ఉంటాయి.

Next Story