భారీ వ‌ర్షాలు.. జ‌ల‌దిగ్భంధంలో కొన్ని ప్రాంతాలు.. 23 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు

Parts Of Chennai Under Water Holiday Declared In Schools Across 23 Districts. 23 జిల్లాల్లో గ‌ల పాఠశాలలకు సెలవు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2022 11:18 AM IST
భారీ వ‌ర్షాలు.. జ‌ల‌దిగ్భంధంలో కొన్ని ప్రాంతాలు.. 23 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు

త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని వ‌రుణుడు వ‌ద‌ల‌డం లేదు. గ‌త కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో కుండ‌పోత‌గా వాన‌లు కురుస్తున్నాయి. చెన్నైలో గురువారం రాత్రి కూడా భారీ వ‌ర్షం కురిసింది. దీంతో రోడ్లు అన్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక శుక్ర‌వారం కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో 23 జిల్లాల్లో గ‌ల పాఠ‌శాలు, క‌ళాశాల‌ల‌కు ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో చెన్నైతో పాటు చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి న‌మోదైంది. గ‌త 30 సంవ‌త్స‌రాల్లో ఇలాంటి వ‌ర్షాపాతం న‌మోదు కాలేద‌ని అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. పొన్నేరి, అవడి ప్రాంతాల్లో ఏకధాటిగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. దీంతో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో.. కూడ‌ళ్ల వ‌ద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఫ‌లితంగా వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్ప‌పీడ‌న ద్రోణి ప్ర‌భావంతో నవంబర్ 13 వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, స‌ముద్రంలో అల‌ల ఉదృతి నేప‌థ్యంలో మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని సూచించింది.

Next Story