ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే వ్యతిరేకత ఉండదు: మోదీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

By Srikanth Gundamalla  Published on  4 Dec 2023 5:57 AM GMT
parliament, prime minister,   delhi,

 ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే వ్యతిరేకత ఉండదు: మోదీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. శీతాకాలం ఆలస్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతోందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా ఆయా రాష్ట్రాల్లో వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయని అన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక్షాన ఉన్నవారికి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని.. అలాంటి తపన ఉంటే ప్రజా వ్యతిరేకత ఏమాత్రం ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

భారత దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ అనుకూలత, సుపరిపాలన, పారదర్శకత ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. ద్వేషభావాన్ని దేశం తిరస్కరించిందని అన్నారు. ప్రజల ఆశయాలను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్య ఆలయమే కీలకం అని ప్రధాని మోదీ అన్నారు. కాగా.. వెలువడ్డ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక.. పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చే సభ్యులంతా ప్రిపేరు కావాలనీ.. బిల్లుల గురించి సభలో చర్చ సజావుగా సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష ఎంపీలు సహకరించాలని కోరారు. కొత్త పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Next Story