పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. లోక్‌సభలో ఇరుపక్షాల నేతలు బిగ్గరగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ చీఫ్, నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి భార్యగా మారిందని, ప్రభుత్వం దానిని "ఇంటికి తిరిగి తీసుకురావాలి" అని వాఖ్యానించగా.. సభలో ఎంపీలు బిగ్గరగా నవ్వారు.
నిన్న అర్థరాత్రి సభను ఉద్దేశించి బెనివాల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మోకరిల్లిందని ప్రభుత్వం చెప్పింది. మీరు ఆపరేషన్‌కు సింధూర్ అనే పేరు పెట్టారు. పాకిస్థాన్ నుదిటిపై భారత్ సింధూరం పూస్తున్నట్లు అనిపించింది. హిందూ విశ్వాసాల ప్రకారం.. ఒక స్త్రీ తన భర్తను తన సింధూరంగా భావిస్తుంది. భారత్ పాక్ వెన్ను విరవడానికి ప్రయత్నించినప్పుడు.. పాక్ భారత్ భార్య అయింది. ఇప్పుడు మిగిలింది విదయ్(హిందూ సంప్రదాయంలో అప్పగింతలు) మాత్రమే.. మీరు వెళ్లి పాకిస్తాన్‌ని ఇంటికి తీసుకురండి’’ అని చెప్పడంతో సభ్యులు నవ్వడం ప్రారంభించారు.
హనుమాన్ బెనివాల్ ప్రకారం.. పహల్గామ్ దాడి ఒక పెద్ద భద్రతా లోపమని, దీనిపై దర్యాప్తు జరగాలని అన్నారు. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందో తెలుసుకోవాలన్నారు. అగ్నివీర్ పథకం తర్వాత సైనికుల సంఖ్య తగ్గిందని, మళ్లీ పెంచాలని ప్రభుత్వాన్ని హనుమాన్ బేనీవాల్ కోరారు.