పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.
By Knakam Karthik
పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముస్లింలు, కశ్మీరీలను నిందించొద్దు అని ఆయన భార్య హిమాన్షీ నర్వాల్ ఇటీవల కోరారు. దీంతో హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. ట్రోలింగ్ ని ఖండించింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుబడుతూ ట్రోల్ చేయడం సరికాదని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. "లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత ఆమె భార్య హిమాన్షీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ దురదృష్టకరం. దీన్ని ఖండిస్తున్నాం. ఆమె వ్యాఖ్యలు చాలా మందికి నచ్చకపోవచ్చు. ఆమె వ్యాఖ్యలను అంగీకరించినప్పటికీ, అసమ్మతిని ఎల్లప్పుడూ మర్యాదగా, రాజ్యాంగ పరిమితుల్లోనే వ్యక్తపరచాలి. ఒక మహిళను ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణ తప్పు పడుతూ ట్రోల్ చేయడం సరికాదు. లేదా ఆ మహిళ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని జాతీయ మహిళా కమిషన్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది.
హిమాన్షి ఏమన్నారంటే? ఇటీవలే ఒక ఇంటర్వ్యూతో హిమాన్షి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహెల్గాం దాడికి సంబంధించి ముస్లింలు, కశ్మీరీలను ప్రజలు లక్ష్యంగా చేసుకోవద్దని హిమాన్షి నొక్కి చెప్పారు. "ముస్లింలు మరియు కాశ్మీరీల వెంట ప్రజలు వెళ్లడం మాకు ఇష్టం లేదు. మాకు శాంతి, న్యాయం కావాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలి" అని ఆమె ఇంటర్వ్యూలో అన్నారు. ఆ తర్వాత ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. ఈ ఘటనను సామాజిక, రాజకీయ అవకాశంగా మలుచుకున్నారని ఒక నెటిజన్ ట్రోలింగ్ చేశాడు. మరో వ్యక్తి ఆమెను కాల్చి చంపాలన్నారు. దాడి జరిగిన తర్వాత ఇంత స్థిరంగా ఎలా కన్పించిందో అని మరో నెటిజన్ ప్రశ్నించారు. భద్రతా సంస్థలు ఆమె నేపథ్యాని తనిఖీ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. కాగా.. హిమాన్షిపై ఈ నెగిటివిటీ పెరగడంతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.