ఘోరం.. ప్రాణవాయువు అందక 20 మంది మృతి
Oxygen shortage 20 covid-19 patients die.ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 7:06 AM GMTఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ కొరత కారణంగా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో అలాంటి ఘటనలు చూశాం. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 20 మంది ఊపిరి వదిలారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కాగా.. ఆక్సిజన్ నిల్వలు మరో అరగంట మాత్రమే ఉన్నాయని శనివారం ఉదయం 10.15 గంటలకు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డా.డీకే బలూజా తెలిపారు.
ప్రభుత్వం తమకు 3.5 టన్నుల ఆక్సిజన్ ను కేటాయించిందని, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఆ ఆక్సిజన్ ఆసుపత్రికి చేరాల్సి ఉందన్నారు. అయినప్పటికీ అర్థరాత్రి 12 గంటల వరకు 1500 లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఆస్పత్రికి చేరిందన్నారు. 7 గంటలు ఆలస్యంగా రావడంతో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 215 మంది కరోనా పేషెంట్ల ఉన్నారని.. వారందరికీ ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఢిల్లీలో ఆక్సిజన్ అందట్లేదని ఆస్పత్రులు వరుసగా ఎమర్జెన్సీ సందేశాలు అందిస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రి, సర్ గంగారాం హాస్పిటల్, మూల్ చంద్ హాస్పిటళ్లు ఇప్పటికే తమకు వీలైనంత త్వరగా ఆక్సిజన్ ను సరఫరా చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరాయి. తాజాగా జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని చాలా ఆసుపత్రుల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది.