రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. పోలీసుల మీద కూడా దాడి చోటు చేసుకుంది. పోలీసులు కూడా పలువురు రైతులను చితకబాదారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న 100 మంది రైతులు ఆ ఘటన తర్వాత ఇప్పటివరకు కనిపించడం లేదని పంజాబ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకటించింది. పంజాబ్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 మంది రైతులు కనపడట్లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు కూడా నమోదు చేశారు. నిరసన ప్రదర్శన సందర్భంగా రైతులు ఎర్రకోటపై జెండా ఎగరేసిన విషయం తెలిసిందే. అదృశ్యమైన వారిలో ఎర్రకోట వద్ద నిరసనలో పాల్గొన్న వారే అత్యధిక మంది ఉన్నారని పంజాబ్ లోని ఆ హక్కుల సంస్థ తెలపింది. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో సుమారు 200 మంది రైతులపై ఢిల్లీ ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ రైతులంతా ఎక్కడికి పోయారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల రద్దు, మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని పోలీసులు చూస్తున్నారని కిసాన్ మోర్చా ఆరోపించింది. రైతుల ఆందోళన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆదివారం సాయంత్రం వరకు ఆందోళన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు. ఢిల్లీ శిబిరాలకు రైతులు భారీగా తరలివస్తున్నారు. గాజీపుర్‌లోని ఢిల్లీ-మేరఠ్ రహదారిపై శిబిరానికి రైతులు భారీ సంఖ్యలో వస్తున్నారు.