ఎండలు మండిపోతున్నాయి..సంతలో చాలా పని ఉంది.. ఇలాంటప్పుడు కూల్ కూల్ గా ఉండే లస్సి తాగితే కడుపులో చల్లగా ఉంటుంది అనుకున్నారు ఒడిస్సా లోని కుర్తి గ్రామం లో ప్రజలు. అనుకున్నదే తడవుగా గుంపులు, గుంపులు గా వెళ్లి లస్సి ని ఆస్వాదించారు. తాగిన కాసేపటికే వంద మందికి పైగా కడుపునొప్పికి గురై ఆస్పత్రిలో చేరారు.

సరదాగా తాగిన లస్సీ ప్రజల ప్రాణాలమీదకి వచ్చిన సంఘటన ఒడిశా రాష్ట్రంలో మల్కన్ గిరి జిల్లా కుర్తీ విలేజ్ లో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో వారాంతపు సంత జరుగుతుంటుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు అక్కడ ఉన్న ఓ దుకాణంలో లస్సీ తాగారు. అనంతరం ఎవరింటికి వారు వెళ్లారు. కొద్దిసేపటికి లస్సీని తాగిన వారు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రులకు పరుగులు తీశారు.

దాదాపు వంద మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు గుర్తించారు. విషయం కనుక్కోగా వారందరు కామన్ గా చేసిన పని లస్సి తాగడమే.. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న కొంతమంది ఆసుపత్రిలో చేరగా.. మరికొంత మంది కోసం పొడియా ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందే గ్రామానికి వెళ్లి ఇల్లిల్లు తిరిగి సేవలందిస్తున్నారు. బాధితులలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. దీనిపై సీడీఎంఓ ప్రఫుల్లా కుమార్‌ స్పందించారు. వెంటనే కుర్తీ గ్రామాన్ని సందర్శించారు. అసలు ఈ సంఘటనకు కారణాలు ఏమిటి తదితర వివరాలను సేకరిస్తున్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story