జమిలి ఎన్నికలు..రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే: రాహుల్

జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on  3 Sept 2023 4:03 PM IST
one nation-one eletion, Rahul gandhi, Congress,

జమిలి ఎన్నికలు..రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే: రాహుల్

జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా ప్రతిపాదిస్తూనే ఉంది. అయితే, ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కార్యరూపం మాత్రం దాల్చలేదు. తాజాగా.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాక జమిలి ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కమిటీ కూర్పుపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించినట్లు చెబుతోంది.

ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనేది..భారత్ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచన అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌ అంటేనే రాష్ట్రాల సమైఖ్యత అన్నారు. జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే అని ఆరోపించారు. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలు ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ. నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు అర్థం అవుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ న్నారు. అందుకే కాంగ్రెస్ నేత అధిర్‌ రంజన్‌ చౌదరిని ఆ కమిటీ ఉండేందుకు నిరాకరించామని.. ఇది సరైన నిర్ణయమే అని జైరాం రమేశ్ అన్నారు.

జమిలి ఎన్నికలపై అధ్యయనం చేయాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చైర్మన్‌గా 8 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇందుకు స్పష్టమైన గడువు మాత్రం నిర్దేశించలేదు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చని.. ఇది ప్రజల సూచనలనూ వింటుందని తాజా గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి, అవసరమైనవాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది.

Next Story