దయానీయం.. భార్యను తోపుడు బండి మీద ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త

Old Man takes sick wife to hospital on pushcart no help from 108 helpline in Madhyapradesh. 108 సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. అంబులెన్స్ సర్వీస్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో

By అంజి  Published on  12 Jan 2023 12:31 PM GMT
దయానీయం.. భార్యను తోపుడు బండి మీద ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త

108 సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. అంబులెన్స్ సర్వీస్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. 108 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా అంబులెన్స్ సేవలు అందించకపోవడంతో ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తన భార్యను తోపుడు బండి మీద ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభుత్వ ఆరోగ్య సేవలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రేవా జిల్లాలోని హనుమాన వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో ఉన్న భార్యను 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లేందుకు వృద్ధ భర్త 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో విసుగు చెందిన సదరు వ్యక్తి రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో అనివార్యంగా అస్వస్థతకు గురైన మహిళను తోపుడు బండి మీద ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తన భార్యను ఆస్పత్రికి తోసుకెళ్తున్న దయనీయ దృశ్యాన్ని చూసిన ఓ బాటసారి ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇది వైరల్‌గా మారింది. దీంతో అంబులెన్స్ సేవలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై మీడియా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఆరా తీయగా.. దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. అంబులెన్స్‌లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో బంధువులు అస్వస్థతకు గురైన వారిని తోపుడు బండ్లు, బైక్‌లు, ఇతర రవాణా మార్గాల ద్వారా తీసుకెళ్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. అంబులెన్స్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బీహార్‌లో కూడా ఓ సంఘటన జరిగింది: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో, అంబులెన్స్ రాకపోవడంతో గర్భిణీ భార్యను కూరగాయల బండి మీద ఆసుపత్రికి తరలించిన దయనీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవ నొప్పితో బాధపడుతున్న మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా రెస్క్యూ వాహనం రాలేదు. దీంతో కమ్రుద్దీన్‌ గంజ్‌లో నివాసం ఉంటున్న భర్త రాజీవ్‌ ప్రసాద గర్భిణి అయిన భార్యను తోపుడు బండి మీద తోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

చక్రాల బండిలో మనవడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తాత: అనారోగ్యంతో బాధపడుతున్న మనవడిని తాతయ్య చక్రాల బండిలో ఆస్పత్రికి తీసుకొచ్చిన ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోనూ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. తాత మనవడిని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు, ఆ తర్వాత వైద్యుడు అతనికి చికిత్స చేశాడు.

Next Story