పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు కారణమిదే : కేంద్ర పెట్రోలియం మంత్రి
Oil Minister Gives Two Main Reasons Behind Fuel Price Rise. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు గల కారణాలను కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
By Medi Samrat Published on 22 Feb 2021 10:53 AM ISTవరుసగా పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడికి భారంగా మారింది. రోజురోజుకు ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు గల కారణాలను కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇంధన ఉత్పత్తులు తగ్గాయని, మాన్యుఫ్యాక్చరింగ్ కంట్రీస్ ఎక్కువ లాభాల కోసం తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇంధనాన్ని వినియోగించుకునే దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించవద్దని పెట్రోలియం ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్, ఒపెక్ ప్లస్ దేశాలను కోరినట్లు వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించడం వల్ల భారత దేశంపై ప్రభావం తీవ్రంగా ఉంటోందని వెల్లడించారు.
అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన దెబ్బకొట్టిందని, వైరస్‌కు సంబంధించి ఖర్చుల ప్రభావం కూడా ధరల పెరుగుదలపై పడిందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆదాయం సంపాదించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధన ధరలను పెంచుతున్నాయని ఆయన అన్నారు. పెట్రోల్ ధరల కారణంగా సామాన్యుడిపై తీవ్రమైన భారం పడుతుందన్నారు.
ధరల పెరుగుదలపై ప్రతిపాక్షాల మండిపాటు:
కాగా, కరోనా ప్రభావంతో పెట్రోల్ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడం వల్ల పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించాలని చమురును ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని గత ఏడాది ఏప్రిల్‌లో మన దేశం సమర్ధించింది. ఇక వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పందిస్తూ ధరల పెరుగుదలకు రాష్ట్రాల బాధ్యత కూడా ఉందని తెలిపింది. చమురు ధరల పెరుగుదలపై కేంద్ర సర్కార్‌ను నిందించడం సరికాదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ పెంచుతున్నాయని పేర్కొంది.