హరిద్వార్ లో మహా కుంభమేళా గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. హరిద్వార్ సూపర్ స్ప్రెడర్ గా మారుతోందని నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. కుంభమేళాకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతూ ఉండడంతో ప్రస్తుతానికి ఆపేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు ప్రచారం అవుతూ ఉన్నాయి. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం మహా కుంభమేళా ఎటువంటి ఆటంకాలు లేకుండానే సాగుతుందని చెబుతూ ఉన్నారు. కుంభమేళా నిర్వహణపై వస్తున్న ఊహాగానాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం మాట్లాడుతూ.. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా కుంభమేళా జరుగుతుందని హామీ ఇచ్చింది.
రెండు వారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉందన్న వార్తల్ని కూడా కొట్టిపారేసింది. ఏప్రిల్ 30 వరకు కుంభమేళా జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కుదించాలని ప్రతిపాదించగా.. అందుకు మతపెద్దలు నిరాకరిస్తున్నారన్న కథనాలు నేషనల్ మీడియాలో రాగా.. అలాంటి చర్చలేమీ జరగలేదని.. కుంభమేళా యథావిధిగా జరుగుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మహా కుంభమేళా జనవరిలో ప్రారంభమై ఏప్రిల్ వరకు జరుగుతుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ కుంభమేళా ఏప్రిల్ 30 వరకు కొనసాగాల్సి ఉంది.