లంచం అడిగిన అధికారి.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన రైతు.. సీఎం సొంత జిల్లాలో
లంచం అడిగిన అధికారికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు ఓ రైతు.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2023 11:35 AM ISTమున్సిపాలిటీ కార్యాలయానికి ఎద్దును తీసుకువచ్చిన రైతు
ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తోంది. లంచం తీసుకుంటున్న అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నప్పటికి కొందరిలో మార్పు రావడం లేదు.
లంచం తీసుకున్న అధికారి పని చేయకుండానే బదిలీ అయ్యాడు. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం డిమాండ్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రైతు ఆ అధికారికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. కర్ణాటక రాష్ట్రంలోని సీఎం సొంత జిల్లా అయిన హవేరీలో ఈ ఘటన జరిగింది.
ఎల్లప్ప రానోజీ అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పు కోసం సవనూర్ మున్సిపాలిటీకి వెళ్లాడు. అవసరం అయిన పత్రాలు జత చేసి దరఖాస్తు చేసుకున్నాడు. పని చేసేందుకు సంబంధిత అధికారి లంచం డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక ఎల్లప్ప అడిగినంత ఆ అధికారికి ఇచ్చాడు. అయితే.. ఆ అధికారి పని చేయకుండానే బదిలిపై వెళ్లిపోయాడు.
దీంతో ఎల్లప్ప కార్యాలయంకు వచ్చి తన గోడును కొత్తగా వచ్చిన అధికారి వద్ద వెళ్లబోసుకున్నాడు. కొత్తగా వచ్చిన అధికారి సైతం లంచం డింమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని ఎంతగా నచ్చజెప్పినప్పటికి ఆ అధికారి మనసు కరగలేదు. లంచం ఇవ్1వనిదే పని కాదని తెగేసి చెప్పేశాడు. దిక్కుతోచని స్థితిలో ఎల్లప్ప తన వద్ద రెండు ఎద్దులు ఉండగా ఒకదానిని తీసుకుని కార్యాలయానికి వచ్చాడు.
లంచం బదులుగా ఎద్దును తీసుకోవాలని సదరు అధికారిని కోరాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు తెలిసింది. లంచం డిమాండ్ చేసిన అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతు పని చేసిపెడతామని హామీ ఇచ్చారు.