సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే పరీక్షలు రాయాల్సిందే. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తుంటారు. అయితే.. ఇక్కడో గ్రామస్తులు మాత్రం తమ ఊరికి సర్పంచ్‌గా పోటీ చేయాలంటే తాము నిర్వహించే రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందేనని అంటున్నారు. అలా ఉత్తీర్ణులు అయిన వారికే తాము ఓటు వేస్తామని చెబుతున్నారు. వారు చెప్పినట్లుగా పరీక్ష రాయడానికి సిద్దమైన అభ్యర్థులకు శనివారం పరీక్ష నిర్వహించారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సుందర్‌గఢ్ జిల్లా కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో పలువురు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి ఉన్నారు. గ్రామస్తులు శనివారం సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 7 ప్రశ్నలతో కూడి ప్రశ్నాపత్రాన్ని వారికి అందించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మీరు చేసిన సమాజ సేవలు ఏమిటీ..? ఒక వేళ మీరు గెలిస్తే గ్రామంలో రానున్న ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతారు. గెలిచిన తర్వాత తమ యోగక్షేమాలు పట్టించుకుంటారా ? వంటి ప్రశ్నలు అందులో ఉన్నాయి.
ఈ పరీక్షలను 8 మంది రాయగా.. ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. మిగతా ఐదుగురు ఫెయిల్ అయ్యారు. ఇక ఉత్తీర్ణులు అయిన ముగ్గురిలో గ్రామస్తులు ఎవరిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారో చూడాలి మరీ. కాగా.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తమ సర్పంచ్ అభ్యర్థులను కూడా ఇదే విధంగా ఎన్నుకుంటామని కొందరు కామెంట్లు చేస్తున్నారు.