Odisha Train Accident: 51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. రైలు సేవలు ప్రారంభం

275 మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత.. ఆ ట్రాక్‌లో రైలు సేవలు తిరిగి

By అంజి  Published on  5 Jun 2023 8:30 AM IST
Ashwini Vaishnaw, Indian Railways, Odisha, Odisha Train accident

51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. రైలు సేవలు ప్రారంభం

275 మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత.. ఆ ట్రాక్‌లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ స్టేషన్‌లో డౌన్-లైన్ ట్రాక్‌లో పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత రైలు సేవలు చివరకు పునరుద్ధరించబడ్డాయి. ఈ మార్గం గుండా వైజాగ్ నుంచి రూర్కెలా వెళ్లే బొగ్గుతో కూడిన గూడ్స్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మార్గం గుండా డీజిల్ రైళ్లు మాత్రమే నడపగలవని రైల్వే అధికారులు తెలిపారు.

"ఎలక్ట్రిక్ కేబుల్ పునరుద్ధరించబడిన తర్వాత రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. దీనికి మరో మూడు రోజులు పడుతుంది అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. జూన్ 2 సాయంత్రం మూడు రైళ్లు - కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యెహ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ మరియు ఒక గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 275 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశంతో పాటు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

రైలు దుర్ఘటన కారణంగా వివిధ స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు పూరీ - హావ్‌డా మధ్య మూడు ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే నిర్ణయించింది.

Next Story