దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో దాదాపు ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయి. రోగుల తాకిడి పెరిగిపోతుండడంతో వారికి బెడ్లను సమకూర్చడం ఆస్పత్రి సిబ్బందికి తలకుమించిన భారంగా మారిపోతుంది. ఆరోగ్య సిబ్బంది.. రోగులకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అయినప్పటికి వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆస్పత్రుల్లో డాక్టర్లకు, నర్సులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఒత్తిడిలో సహనం కోల్పోయి.. ఒకరిపై మరొకరు దూషణలకు దిగడమే కాకుండా చేయి కూడా చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్‌కు నర్స్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఒకరిని మరొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నర్సు.. డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో డాక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న వారు ఆ డాక్టర్‌ను ఆపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా కూడా ఘటనపై ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని.. ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయామని చెప్పారని తెలిపారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.