ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు.. రైలుకు నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు

NTPC aspirants in Gaya set ablaze train.బీహార్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష‌లు(ఆర్ఆర్‌బీ) ప‌రీక్ష‌లు రాసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2022 4:27 PM IST
ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు.. రైలుకు నిప్పుపెట్టిన ఆందోళ‌న‌కారులు

బీహార్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్ ప‌రీక్ష‌లు(ఆర్ఆర్‌బీ) ప‌రీక్ష‌లు రాసిన అభ్య‌ర్థులు చేప‌ట్టిన నిర‌స‌న‌లు ఆందోళ‌నక‌రంగా మారాయి. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని అభ్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో వేలాది మంది అభ్య‌ర్థులు గ‌త కొద్ది రోజులుగా ఆందోళ‌న‌లు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. బుధ‌వారం గ‌యాలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గ‌యాలో ఓ రైలుకు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. మంటల్లో బోగీల్లోని సీట్లు, బెర్తులు పూర్తిగా కాలి బూడిదయ్యారు.

సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో నిర్వహించిన రైల్వే పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని కోరారు.

కాగా.. గయలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని గయ ఎస్ఎస్‌పీ ఆదిత్య కుమార్ తెలిపారు. నిరసనకారులు ఒక రైలుకు నిప్పుపెట్టారన్నారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారిలో ప‌లువురిని గుర్తించిన‌ట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, విద్యార్థులు ఎవరి ప్రభావానికి లోనుకావద్దని, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయవద్దని సూచించారు.

విద్యార్థుల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఎన్టీపీసీ, లెవ‌ల్ 1 ప‌రీక్ష ఫ‌లితాల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు రైల్వేశాఖ ప్ర‌క‌టించింది. సెల‌క్ష‌న్ విధానంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే.. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇరువర్గాల వాదనలు విని కమిటీ ఒక నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుందని పేర్కొంది.

Next Story