నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా తమ లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపణలు చేయగా అవి తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ఎట్టకేలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపింది. 'పరీక్షా సమయంలోగానీ, ఆ తరువాత గానీ ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన తరహాలో ఎలాంటి చర్యలను ఎన్‌టీఏ అనమతించదు. వివిధ వర్గాల సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ పరీక్షలను నిర్వహిస్తామని' ఓ ప్రకటనను ఎన్‌టీఏ విడుదల చేసింది.
ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్‌ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు.
కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు.