గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?
Noted industrialist Gautam Adani gets Z category security. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి 'జెడ్' కేటగిరీ వీఐపీ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించనునన్నట్లు
By అంజి Published on 17 Aug 2022 7:51 PM ISTప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి 'జెడ్' కేటగిరీ వీఐపీ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించనునన్నట్లు పీటీఐ తెలిపింది. సీఆర్పీఎఫ్ కమాండోలు 130.2 బిలియన్ డాలర్ల నికర సంపద కలిగిన అదానీకి ఇకపై రక్షణగా ఉండనున్నారు. హోంమంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. అదానీకి ముప్పు ఉందంటూ సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జెడ్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చు అంతా కూడా అదానీనే భరించాల్సి ఉంటుంది.
ఇందుకు నెలకు సుమారు రూ.15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. కాగా అదానీకి భద్రత కల్పించాలని ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ను కేంద్రం కోరింది. దీంతో సీఆర్పీఎఫ్ కమాండోలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. మరో దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీకి 2013 నుంచి జెడ్ ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్ల నుంచి ఆయన భార్య నీతా అంబానీకి కాస్త తక్కువ స్థాయి భద్రత కల్పిస్తోంది.
వ్యక్తి హోదాను, పరిస్థితిని బట్టి కేంద్రం భద్రతను కల్పిస్తుంది. కేంద్రం ఆరు రకాల సెక్యూరిటీలను కల్పిస్తోంది. అందులో X, Y, Y ప్లస్, Z, Z ప్లస్, SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)లు ఉన్నాయి. ఎస్పీజీ అనేది ప్రధాన మంత్రి, అతని కుటుం సభ్యులకు మాత్రమే కేటాయిస్తారు. Z కేటగిరీ రక్షణలో కనీసం 4 నుండి 5 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు,పోలీసు సిబ్బంది ఉంటారు. అదానీ భద్రత కోసం 30 మందికి పైగా సాయుధ సిబ్బందిని నియమించనున్నారు.
కాగా, సెప్టెంబరు 26-27 తేదీల్లో సింగపూర్‌లో జరిగే ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించేందుకు గౌతమ్ అదానీ సింగపూర్ డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్‌తో కలిసి పాల్గొంటారని ఫోర్బ్స్ మీడియా బుధవారం ప్రకటించింది. సదస్సు రెండో రోజున అదానీ కీలక ప్రసంగం చేయనున్నారు. 20వ ఫోర్బ్స్ గ్లోబల్ సీఈఓ కాన్ఫరెన్స్‌లో దాదాపు 400 మంది ప్రముఖ సీఈఓలు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు సమావేశమవుతారని తెలిపింది.