దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కి కోర్టు విధించిన జీవిత ఖైదు విధించిన తెలిసిందే. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ తీర్పుపై తాను సంతృప్తి చెందలేదని అన్నారు. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో దోషికి మరణ శిక్ష విధించాలని తామంతా డిమాండ్ చేస్తే అలా జరగలేదని మమతా బెనార్జీ అన్నారు. ఈ కేసును బెంగాల్ పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. ఒక వేళ ఈ కేసు దర్యాప్తు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణశిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించే వారని సీఎం మమత చెప్పుకొచ్చారు. అసలు విచారణ ఎలా జరిగిందో తెలియదన్న ఆమె, రాష్ట్ర పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో దోషులకు మరణ శిక్ష పడిందని చెప్పారు. ప్రస్తుత తీర్పు సంతృప్తి కరంగా లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
కాగా గతేడాది ఆగష్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ హాస్పిటల్ సెమినార్ రూమ్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన ప్రకంపనలు రేపింది. ఈ కేసు బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ అయింది. దీనిలో భాగంగా విచారణ అనంతరం ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్‌లో చేర్చింది.