'అలా శృంగారం చేస్తే.. ఆధార్‌, పాన్ చూడాల్సిన పనే లేదు'

Not required to check Aadhaar, PAN before having consensual physical relationship. ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకాభిప్రాయంతో అంటే ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనే వ్యక్తులు

By అంజి  Published on  30 Aug 2022 4:10 PM IST
అలా శృంగారం చేస్తే.. ఆధార్‌, పాన్ చూడాల్సిన పనే లేదు

ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకాభిప్రాయంతో అంటే ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొనే వ్యక్తులు.. తమ పార్టనర్‌ వయస్సు తెలుసుకునేందుకు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డ్‌ చెక్‌ చేయాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినట్లు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. అయితే ఆ వ్యక్తి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ విచారించారు. ఈ కేసులో మైనర్‌ బాలిక అని చెప్పబడుతున్న మహిళకు రికార్డుల ప్రకారం.. 3 రకాల పుట్టిన రోజులు ఉన్నాయని, అత్యాచారం జరిగిన నాటికి ఆమె మైనర్‌ కాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

అలాగే ఇష్టపూర్వకంగా శారీర‌క సంబంధం పెట్టుకున్న వ్య‌క్తి .. త‌న భాగ‌స్వామి పుట్టిన రోజు వివరాలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, దాని కోసం ఆ వ్య‌క్తి ఆధార్‌, పాన్ కార్డును ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఆధార్ కార్డులో ఆ మ‌హిళ పుట్టిన రోజు 01-01-1998గా ఉంద‌ని, ఈ ఒక్క ఆధారంతో ఆమె మైన‌ర్ కాదని తెలుస్తోంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే అమ్మాయికి భారీ మొత్తంలో డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యింద‌ని పేర్కొన్న కోర్టు.. బెయిల్ ఇవ్వ‌డానికి ఇది కూడా ఓ కార‌ణం అవుతుంద‌ని తెలిపింది.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు అతి ఆలస్యం చేశారని కోర్టు పేర్కొంది. అమాయకులను హనీ ట్రాప్‌లో బంధించి, వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్న కేసులున్నాయని జ‌డ్జి త‌న తీర్పులో ప్ర‌స్తావించారు. హనీ ట్రాపింగ్‌కు సంబంధించిన కేసులను వ్యక్తిగతంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో మరే ఇతర వ్యక్తిపైనైనా ఇలాంటి ఎఫ్‌ఐఆర్‌ను ప్రాసిక్యూట్రిక్స్ నమోదు చేసినట్లయితే, ప్రాసిక్యూట్రిక్స్‌కు సంబంధించి పోలీసు కమిషనర్‌కు వివరణాత్మక దర్యాప్తు ఉంటుందని కోర్టు ఆదేశించింది.

Next Story