రాయితీ గ్యాస్ సిలిండర్ ధర మరో మారు పెరిగింది. రాయితీ గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెంచుతూ కేంధ్రం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తోంది. దీంతో సామాన్యుడి నెత్తి మీద మరో పిడుగు పడినట్టయ్యింది. వంటింట్లో గ్యాస్ వాడాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓ వైపు పెట్రోల్ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ. వందకు చేరువగా వెళ్తున్న వేళ.. గ్యాస్ బండ ధర పెరిగి సామాన్యుడి పాలిట గుదిబండలా మారింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 769కి చేరుకుంది. ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను నిలిపివేయనుందని నివేదికలు వెలువడుతున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్రోలియం సబ్సిడీ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.12,995 కోట్లుగా కేటాయించింది. అదే సమయంలో ఉజ్వల స్కీమ్ కింద మరో కోటి మందికి గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని బడ్జెట్-2021లో వెల్లడించింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచితే ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుందనే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందువలనే గ్యాస్ సిలిండర్ ధర పెరురుతూనే వస్తోందని తెలిపాయి. అయితే ఇవ్వన్నీ నివేదికలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంతో ఎవ్వరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ సబ్సిడీ అంశంపై ఒకసారి స్పష్టత ఇస్తే వినియోగదారులకు ఉందోళన ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయం.