ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలు లేనట్లేనా.?
No Truck With AAP in 2024, No Support Over Ordinance Too. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు.
By Medi Samrat Published on 29 May 2023 2:07 PM ISTకాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీలో అధికారుల బదిలీలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌కి మద్దతు ఇవ్వవద్దని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు సూచించారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ కూడా తేల్చి చెప్పింది. అయితే తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు.
కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్.. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కలవడానికి కూడా సమయం కోరారు. ఈ అంశంపై మద్దతు కోరేందుకు కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సమావేశం తర్వాత చంద్రశేఖర్ రావు ఆప్‌కి మద్దతు తెలుపుతూ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోనూ కేజ్రీవాల్ భేటీ అయ్యారు.
ఢిల్లీలో పరిపాలన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అధికారుల బదిలీ, పోస్టింగ్ హక్కులు ఢిల్లీ ప్రభుత్వానికి ఉంటాయని మే 11న సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం సీనియర్ అధికారుల బదిలీకి ఉత్తర్వు జారీ చేసింది. ఉత్తర్వుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీని ప్రకారం అధికారుల బదిలీ, పోస్టింగ్, విజిలెన్స్‌కు సంబంధించిన విషయాల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. వీరు అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై నిర్ణయాలు తీసుకుని ఎల్‌జీకి సిఫార్సులను పంపుతారు. ఈ సిఫార్సుల ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారు. లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించకపోతే.. ఆయన దానిని తిరిగి తిరస్కరించవచ్చు. అభిప్రాయ భేదాలు ఏర్పడితే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే అంతిమంగా పరిగణించబడుతుంది.
ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించడం లేదని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నారు. అయితే ఢిల్లీ కాంగ్రెస్ మాత్రం ఆప్‌తో పొత్తుకు సానుకూలంగా కనిపించడం లేదు.