ఉక్రెయిన్‌లో రష్యా చేసిన దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మృతి చెందాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు, మరణించిన యువకుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని దేశానికి ఎప్పుడు తీసుకువస్తారనే దానిపై కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు అధికారుల నుండి నిర్దిష్ట సమాచారం రాలేదు. మృతుడు నవీన్ సోదరుడు హర్ష బుధవారం మాట్లాడుతూ.. 'మృతదేహాన్ని తిరిగి తీసుకువస్తారో లేదో ఎవరూ ధృవీకరించడం లేదు. అతని మృతదేహాం తీసుకురావాలి. అతని స్నేహితులు సజీవంగా తిరిగి వస్తున్నారు. మేము మరణ వార్తతో బాధపడుతున్నాము." అతను చెప్పాడు.
నవీన్ తండ్రి శేఖరప్ప మాట్లాడుతూ.. తన కొడుకును కోల్పోయానని, సజీవంగా ఉన్న ఇతర విద్యార్థులను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఉక్రెయిన్‌లో వేలాది మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, వారు మన దేశానికి చెందిన ఆస్తులని, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆయన అన్నారు. తక్షణం సాధ్యం కాని పక్షంలో రెండు, మూడు రోజుల్లో మృతదేహాన్ని తీసుకురావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. నవీన్ మృతదేహం వార్ జోన్‌లో పడి ఉండటంతో అధికారులకు చిక్కుముడి ఏర్పడింది. ఈ వార్త నవీన్ కుటుంబీకులు, బంధువుల్లో విషాదాన్ని నింపింది.