కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుండి విమాన ప్రయాణలలో భోజన సేవలను నిలిపివేయాలని పౌరవిమానయాన శాఖ సోమవారం నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయం రెండు గంటలలోపు ప్రయాణీకులకు మాత్రమే వర్తించనుండగా.. గురువారం నుండి ఈ నిషేధం అమల్లోకి రానుంది.
ఇదిలావుంటే.. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్రెజిల్ దాటి అత్యధిక కేసులు నమోదౌతున్న జాబితాలో అమెరికా తర్వాతే మనమే ఉన్నాం. దీంతో విమాన ప్రయాణాలపై నిబంధనలు విధించింది. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు విమానాల్లో పయనించే ప్రయాణీకులకు మాత్రమే భోజన సదుపాయాన్ని అందిస్తామని పేర్కొంది.
ప్రతి ఒక్కరికీ భోజనం, పానీయాలు సర్వ్ చేసే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా చేతులకు గ్లవ్స్ తొడగాలని పేర్కొంది. గత ఏడాది కరోనా కారణంగా మార్చి 25 నుండి విమానాలు నిలిపి వేసిన సంగతి విదితమే. పునరుద్ధరించినప్పటికీ.. భోజన సేవలను అనుమతించలేదు. ఆగస్టు 31 తర్వాత ఈ సర్వీసును తిరిగి ప్రారంభించింది.
ఇదిలావుంటే.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వాళ్ల మొత్తం సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.
వరుసగా 33వ రోజు కూడా దేశంలో క్రియాశీల కరోనా కేసులు పెరిగాయి. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వాళ్ల సంఖ్య 75,086గా ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కరోనా కేసులు 12,01,009 ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 10 కోట్ల 45 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు.
.