ఆకస్మిక గుండెపోటు మరణాలకు కరోనా వ్యాక్సిన్లు కారణమా.? ఎయిమ్స్ వైద్యులు ఏం చెప్పారంటే..?
2020-2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో చాలా మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.
By Medi Samrat
2020-2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో చాలా మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి సోకింది. అయితే.. కరోనా వ్యాక్సిన్ రాగానే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజల ఆరోగ్యంలో చాలా మెరుగుదల కనిపించింది. అయితే.. కోవిడ్ తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
క్రికెట్ ఆడుతూ ఒకరు గుండెపోటుకు గురై చనిపోతే, పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఇలా అకస్మాత్తు మరణాలు పెరిగాయి. దీంతో కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా అకస్మాత్తు గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలలో ఓ అపోహ ప్రారంభమైంది. తాజాగా.. ఈ విషయమై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు స్పష్టమైన సమాచారం అందించారు.
కోవిడ్ వ్యాక్సిన్‌లు ప్రభావవంతమైన వ్యాక్సిన్‌లని, మరణాల రేటును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషించాయని AIIMS ఢిల్లీలోని పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కరణ్ మదన్ అన్నారు. మహమ్మారి సమయంలో టీకాలు మాత్రమే ప్రజల ప్రాణాలను రక్షించిన ఏకైక మార్గం. వ్యాక్సిన్‌లు పెద్ద సంఖ్యలో ప్రజలకు ఇవ్వబడ్డాయి. అధిక మరణాలను నివారించడంతోపాటు గొప్ప ప్రయోజనాలను అందించాయి. టీకాలు అందించిన ప్రయోజనాలు అపారమైనవి. ఇప్పటివరకు ఉపయోగించిన వ్యాక్సిన్‌లను సమీక్షించేందుకు.. ఆకస్మిక గుండె సంబంధిత మరణాలపై అధ్యయనం నిర్వహించామని.. అయితే ఆకస్మిక గుండె సంబంధిత మరణాలకు స్పష్టమైన కారణం కనుగొనబడలేదని డాక్టర్ మదన్ చెప్పారు.
ఈ విషయమై ఢిల్లీలోని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ఆకస్మిక గుండెపోటుతో యువకులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణాన్ని తెలుసుకోవడానికి అధ్యయనాలు జరిగాయి. మీరు ICMR, AIIMS అధ్యయనాలను పరిశీలిస్తే.. యువకుల మరణాలకు COVID-19 వ్యాక్సిన్‌లతో ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టంగా చూపించారని ఆయన అన్నారు. COVID-19 వ్యాక్సిన్‌లు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అన్ని టీకాలు/మందులు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, కానీ COVID-19 టీకాలు, గుండెపోటు మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఏ అధ్యయనం దీనిని చూపించలేదన్నారు.