సీఎంగా నితీష్, డిప్యూటీగా తేజస్వి యాదవ్‌ ప్రమాణ స్వీకారం

Nitish Kumar takes oath as Bihar CM for record 8th time. తేజస్వి యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీలతో క‌లిసి కొత్త "కూటమి"ని

By Medi Samrat
Published on : 10 Aug 2022 2:56 PM IST

సీఎంగా నితీష్, డిప్యూటీగా తేజస్వి యాదవ్‌ ప్రమాణ స్వీకారం

తేజస్వి యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీలతో క‌లిసి కొత్త "కూటమి"ని ప్రకటించిన నితీష్ కుమార్.. 8వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయ‌న వెంట‌ బీహార్‌ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది రెండోసారి. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరు కూడా ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు.

జెడి(యు), బిజెపిల మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్తత వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందు. నితీష్ కుమార్ ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వం నుండి వైదొలిగి.. ఆర్‌జెడి, కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపారు. 71 ఏళ్ల నితీష్ కుమార్‌ మంగళవారం నాడు బీహార్ గవర్నర్‌కు త‌న‌ రాజీనామాను సమర్పించారు. అనంత‌రం మహాఘట్‌బంధన్ (మహాకూటమి) అధినేతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించారు. ఈ నేప‌థ్యంలోనే నేడు కొత్త సంకీర్ణ ప్ర‌భుత్వం కొలువుదీరింది. మరోవైపు నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది.

నితీశ్‌ కుమార్ ప్ర‌మాణ స్వీకారం అనంతరం ఆర్‌జేడీ కీల‌క‌ నేత మాట్లాడుతూ.. శరద్‌ యాదవ్‌ ఆదర్శవంతమైన ప్రధానమంత్రి మెటీరియ‌ల్ అని అన్నారు. 2024లో జరిగే మహాఘటబంధన్‌కి నితీష్‌ కుమార్‌ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని ఆయన అన్నారు.


Next Story