బీజేపీకి 'బ్రేకప్' చెప్పనున్న నితీష్.. మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసే అవకాశం..!
Nitish Kumar ends alliance with BJP. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశమైన జేడీ(యూ) అధినేత
By Medi Samrat
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశమైన జేడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ అయిన లాలూ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ కూడా కీలక సమావేశం నిర్వహించి.. జేడీ(యూ)తో చేతులు కలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్ సీఎంగా నితీష్ కుమార్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ కూడా గవర్నర్‌ను కలవాలని కోరినట్లు సమాచారం.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో నితీశ్ కుమార్ బీజేపీపై ఉన్న అసహనాన్ని బయటకు వెళ్లగక్కినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. జెడి(యు) నేతలను బీజేపీ ఎప్పుడూ అవమానించిందని.. పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుందన్నారు.
ఇదిలావుంటే.. డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం భిఖుభాయ్ దల్సానియా, రేణు దేవి, మంగళ్ పాండే, నితిన్ నవీన్, అమరేంద్ర ప్రతాప్ సింగ్, సామ్రాట్ చౌదరి బయటకు వచ్చారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది.
బిహార్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్పందించారు. దీనిపై మాట్లాడాలనుకోవడం లేదు. అయితే.. బీజేపీ ఎప్పుడూ అనిశ్చితి పరిస్థితిని సృష్టించదు. జేడీ(యు) నిర్ణయం తీసుకుంటుంది.. అయినా నితీష్ కుమార్ సీఎంగా కొనసాగాలని బీజేపీ ఖచ్చితంగా కోరుకుంటుందని వ్యాఖ్యానించారు.