రాజ‌కీయాల్లో ఏది అసాధ్యం కాదు.. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇండియా కూట‌మి వైపు చూస్తారా.?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏన్‌డీఏకు ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో అందరి దృష్టి టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) సార‌థి నితీష్‌ కుమార్‌లపైనే ఉంది.

By Medi Samrat  Published on  4 Jun 2024 7:08 PM IST
రాజ‌కీయాల్లో ఏది అసాధ్యం కాదు.. ఈ ఇద్ద‌రు నేత‌లు ఇండియా కూట‌మి వైపు చూస్తారా.?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏన్‌డీఏకు ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో అందరి దృష్టి టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) సార‌థి నితీష్‌ కుమార్‌లపైనే ఉంది. ఇరువురు నేతలూ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండీయా కూటమి నుండి ఏదైనా ప్రతిపాదన చేస్తే.. వారు పరిశీలించే అవ‌కాశం లేక‌పోలేద‌ని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది.

రేపు ఇండియా కూటమి సమావేశం ఉంటుందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌లను సంప్రదించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది రేపటి నేతల భేటీపై ఆధారపడి ఉంది. ఇది అసాధ్యమూ కాదు.. ఊహించలేనిది కాదు.. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

బీజేపీకి స్పష్టమైన ఫ‌లితాలు రాకపోవడంపై చవాన్ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని నైతిక ఓటమిగా అంగీకరించాలని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నుంచి బీజేపీకి పిలుపు వస్తుంది. అయితే వారి నాయకుడు ఎవరు,? నరేంద్రమోదీ దీన్ని తన నైతిక ఓటమిగా భావించి అధికారానికి దూరంగా ఉంటారా లేక బీజేపీ మరో నేతను ముందుకు తెస్తుందా అని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ట్రెండ్స్ ప్రకారం.. బీహార్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి), జనతాదళ్ (యునైటెడ్)తో కూడిన ఎన్‌డిఎ కూటమి ఆధిక్యంలో ఉంది. బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్) 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భారతీయ జనతా పార్టీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ 16 స్థానాల్లో, వైఎస్సార్‌సీపీ 4 స్థానాల్లో, బీజేపీ 3, జ‌న‌సేన‌ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూట‌మి భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. గ‌త ఎన్నిక‌ల‌లో 151 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ స్థానాల‌ను గెలిచిన వైసీపీ ఈ సారి ఊహించ‌ని ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది.

Next Story