మరో ఉచిత పథకం ప్రకటించిన బిహార్ సీఎం
నీతీశ్ కుమార్ తాజాగా మరో పథకాన్ని తీసుకొచ్చారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు
By Knakam Karthik
మరో ఉచిత పథకం ప్రకటించిన బిహార్ సీఎం
బిహార్ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓటర్లను తమ వైపు ఆకట్టుకునేందుకు నితీశ్ కుమార్ వరుస హామీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేసిన నీతీశ్ కుమార్ తాజాగా మరో పథకాన్ని తీసుకొచ్చారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రానున్న మూడేళ్లల్లో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
'మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరికీ సరసమైన ధరలకు విద్యుత్‌ను అందిస్తున్నాం. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఆగస్టు 1 నుంచి గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు కరెంట్ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే జులై నెల బిల్లు సైతం చెల్లించాల్సిన పని లేదు. దీని వల్ల రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారుల సమ్మతితోనే ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం. కుటిర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం. రాష్ట్రంలో 10వేల మెగావాట్ల వరకు సౌరశక్తి ఉత్పత్తి చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం' అని సీఎం నీతీశ్ కుమార్ తెలిపారు.