ఢిల్లీలో మూడ్రోజులుంటే రోగాలు రావడం ఖాయం: గడ్కరీ

ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.

By Knakam Karthik
Published on : 15 April 2025 1:52 PM IST

National News, Delhi Air Pollution, Nitin Gadkari, Air Quality Index, Mumbai, Bjp Government

ఢిల్లీలో మూడ్రోజులుంటే రోగాలు రావడం ఖాయం: గడ్కరీ

ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో మూడు రోజులు ఉంటే రోగం బారిన పడటం ఖాయమని అన్నారు. నగరంలో కొద్దిసేపు ఉండటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజల ఆయుర్దాయం 10 సంవత్సరాలకు తగ్గుతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయని ప్రస్తావించారు.

కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెండూ రెడ్ జోన్‌లో ఉన్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిస్తూ.. పర్యావరణ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థకు ఏవిధంగా ప్రాధాన్యం ఇస్తామో అలాగే పర్యావరణాన్ని కూడా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణించాలన్నారు. కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రహదారుల మౌలిక సదుపాయాల కల్పన కూడా ఓ పరిష్కారంగా పని చేస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణాలు కాబట్టి వాహనాల్లో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరమన్నారు. మనం దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నామని.. వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తున్న భారత్‌ రవాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాలలో ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడంపై దృష్టిపెడుతోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్‌ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే మన ఖర్చులు 16శాతం వరకు ఉన్నాయని.. 2026 చివరి నాటికి వాటిని సింగిల్‌ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గత సంవత్సరం డిసెంబర్‌లోనూ, నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కాలుష్య స్థాయిలు పెరగడం వల్ల దేశ రాజధానిని సందర్శించాలని తనకు అనిపించడం లేదని , నగరాన్ని సందర్శించిన తర్వాత తనకు తరచుగా ఇన్ఫెక్షన్ వస్తుందని పేర్కొన్నారు. ప్రతిసారీ, ఢిల్లీకి వచ్చినప్పుడు, కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నందున నేను వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తాను" అని ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ చెప్పారు.

Next Story