బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారీగిర్ గ్రామంలోని ఓ ఇటుక బట్టీకి చెందిన ఎత్తయిన చిమ్నీపేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు ధాటికి తీవ్రగాయాలు కావడంతో పాటు ఊపిరిఆడని పరిస్థితుల్లో కార్మికులు మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఇటుక బట్టీ యజమాని సైతం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఇటుక బట్టి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తోందని అధికారులు గుర్తించారు.