మరో రెండు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ
Night Curfew In Tamilnadu And Bihar. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో తమిళనాడు, బిహార్‌లో నైట్ కర్ఫ్యూ.
By Medi Samrat
కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో నైట్ కర్ఫ్యూ విధించే రాష్ట్రలలో ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు కూడా చేరింది. మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆదివారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా ప్రతి రోజు రాత్రిపూట కర్ఫ్యూ తో పాటుగా శనివారం రాత్రి10 నుంచి సోమవారం ఉదయం వరకు అంటే ఆదివారం మొత్తం పూర్తి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. ప్రజా, ప్రైవేటు రవాణా, ఆటోలు, ట్యాక్సీలు ఏవీ తిరగడానికి వీల్లేదని ఆంక్షలు జారీ చేసింది. మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి బీచ్‌లు, పార్క్‌ల్లోకి ప్రజలకు అనుమతి లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో 12వ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. నీలగిరి, కొడైకెనాల్ సహా పలు పర్యాటక ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించమని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
అటు బిహార్‌లో కూడా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను మే 15వ తేదీ వరకూ మూసి వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మూడోవంతు ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. దుకాణాలు, మండీలు, వ్యాపార సంస్థలు సైతం సాయంత్రం 6దాటిన తర్వాత మూసివేయాల్సిందిగా ఆదేశించారు.