ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 రోజులు రాత్రి కర్ఫ్యూ
Night curfew in Karnataka for 10 days from December 28.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 1:43 PM ISTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక మనదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 422 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించాలని ప్రధాని మోదీ సూచించారు.
కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూని విధించగా.. తాజాగా ఆ జాబితాలోని కర్ణాటక కూడా వచ్చి చేరింది. డిసెంబర్ 28 నుంచి కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
సీఎం బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఆతరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక రాత్రి కర్ఫ్యూతో పాటు న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బహిరంగ వేడుకలు, ప్రజలు గుమిగూడటం, డీజేలతో పార్టీలు చేసుకోవడం లాంటి వాటిని ప్రభుత్వం పూర్తిగా నిషేదించింది. 50 శాతం కెపాసిటీతో హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. కర్ణాటకలో 32 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 15 మంది కోలుకున్నారు.