ప్రముఖ కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ ఎమ్మెల్యే దివంగత బీఎం ఇదీనబ్బ కుమారుడు బీఎం బాషా నివాసంపై జనవరి 3న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బాషా కోడలు దీప్తి మర్లా అలియాస్ మరియంను ఏజెన్సీ అదుపులోకి తీసుకుంది. బాషా కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని మస్తికట్టె గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇదీనబ్బ మనవడి భార్య దీప్తి మార్లా యువతను ఐసిస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం ఆమెను సోమవారం అరెస్ట్ చేసింది.
ఎన్‌ఐఏ డిప్యూటీ ఎస్పీ కృష్ణకుమార్ నేతృత్వంలోని బృందం ఆ ఇంట్లో సోదాలు చేసింది. పలు డాక్యుమెంట్లను సెక్యూరిటీ ఏజెన్సీ స్వాధీనం చేసుకుంది. మంగళూరులోని స్థానిక కోర్టులో ఎన్‌ఐఏ ఆమెను రిమాండ్‌కు తరలించి తదుపరి విచారణ కోసం న్యూఢిల్లీకి తీసుకెళ్లింది. అనాస్ అబ్దుల్ రహమాన్ బంధువు అమ్మర్‌కు ఐఎస్‌ఐఎస్ సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఆగస్టులో ఇదే ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు చేసి అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మరియంను ఎన్‌ఐఏ విచారించినా ఆమెను అదుపులోకి తీసుకోలేదు.
గత ఐదు నెలల్లో ఆమెను అరెస్టు చేయడానికి భద్రతా ఏజెన్సీ తగిన సాక్ష్యాలను సేకరించింది. మరియమ్ అసలు పేరు దీప్తి మార్లా. ఆమె యూఏఈలో చదువుకుంది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు నిధులను సేకరించడం, ప్రజలను ప్రేరేపించడం వంటి ఆరోపణలపై ఇప్పటివరకు 11 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.