పీఎఫ్‌ఐ కేసు.. 45 మంది కార్యకర్తలను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ
NIA arrests 45 PFI cadres, 5 of them from TS, AP. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో దేశ
By అంజి Published on 23 Sept 2022 12:01 PM ISTపాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), రాష్ట్ర పోలీసు బలగాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహించాయి. ఈ దాడుల్లో 45 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో కేరళ నుంచి 19 మంది, తమిళనాడు నుంచి 11 మంది, కర్ణాటక నుంచి 7 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 4, రాజస్థాన్ నుంచి 2, యూపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరిని అరెస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టయిన వారిని అబ్దుల్ రహీం, అబ్దుల్ వాహిద్ అలీ, షేక్ జఫ్రుల్లా, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. తెలంగాణకు చెందిన అబ్దుల్ వార్సీని అరెస్ట్ చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్‌లలో పీఎఫ్‌ఐకి సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. సోదాల్లో నేరారోపణ పత్రాలు, నగదు, పదునైన ఆయుధాలు, పెద్ద సంఖ్యలో డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌ఐఏ నమోదు చేసిన 5 కేసులకు సంబంధించి ప్రముఖ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగాయి. పీఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు తీవ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, సాయుధ శిక్షణను అందించడం కోసం శిక్షణా శిబిరాలను నిర్వహించడం, నిషేధిత సంస్థల్లో చేరడానికి ప్రజలను తీవ్రవాదులను చేయడంలో పాల్గొన్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయి.
అనేక హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు పీఎఫ్‌ఐ, నాయకులు, సభ్యులపై గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. కళాశాల ప్రొఫెసర్ చేయి నరికివేయడం, ఇతర మతాలను సమర్థించే సంస్థలతో సంబంధమున్న వ్యక్తులను హత్య చేయడం, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు పేలుడు పదార్థాల సేకరణ, ఇస్లామిక్ స్టేట్‌కు మద్దతు, ప్రజలను నాశనం చేయడం వంటి నేరపూరిత హింసాత్మక చర్యలు పీఎఫ్‌ఐ హస్తముంది.