భారతీయ రైల్వే టికెట్ రద్దు, రీఫండ్ మరియు బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి కీలక సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయల్దేరడానికి 72 గంటల కంటే ముందు టికెట్ రద్దు చేసుకుంటే నామమాత్రపు ఛార్జీల మినహాయింపుతో పూర్తి రీఫండ్ లభిస్తుంది.
అయితే, 72 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం, 24 నుండి 8 గంటల లోపు రద్దు చేస్తే 50 శాతం టికెట్ ధరలో కోత విధిస్తారు. రైలు బయల్దేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్‌ను రద్దు చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు. దళారుల అక్రమాలను అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం బోర్డింగ్ స్టేషన్ మార్పు నిబంధనను సరళతరం చేశారు. ఇకపై రైలు షెడ్యూల్ సమయానికి 30 నిమిషాల ముందు వరకు కూడా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ఏప్రిల్ 1 నుండి 15 మధ్య ఈ మార్పులు దశలవారీగా అమలులోకి రానున్నాయి.