ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వేపై తీవ్రంగా స్పందించింది. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా పరిమితికి మించి టికెట్లు ఎందుకు విక్రయించారని ప్రశ్నించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు నివారించేందుకు భద్రత చర్యలు, రైలు బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసే నిబంధనల అమలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోచ్‌లలో ప్యాసింజర్ల సంఖ్యను పరిమితం చేసేలా ఉన్న నిబంధనలను అమలు చేయడంలోనూ..టికెట్ లేకుండా ప్రవేశించే వ్యక్తులకు జరిమానా విధించేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని రైల్వేను ప్రశ్నించింది.
ఇలాంటి చిన్న విషయాలను సరిగా అమలు చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?.. రద్దీ సమయంలో పరిమితి కంటే ఎక్కువ మంది అనుమతించినా.. దానికి తగ్గట్టుగా సీటింగ్ కెపాసిటీ పెంచాలి కదా అని ప్రశ్నించింది. ఆ విషయంలో నిర్లక్ష్యం జరిగినట్లు కనిపిస్తోందని, ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల సంఖ్య.. సీట్ల సంఖ్యను ఎందుకు మించిపోయిందని క్వశ్చన్ చేసింది. రైల్వే తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ పరిస్థితికి సంబంధించి అన్ని అంశాలను రైల్వే బోర్డు పరిశీలిస్తుందని చెప్పగా.. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 26న జరగనుంది.
కాగా కుంభమేళాకు ప్రయాణికులు భారీగా పోటెత్తడంతో గతవారం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు.