భారతదేశంలో కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని కోరింది. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సలహా పాటించాలని తెలిపింది. కరోనా బాధితులు 3 పొరల మాస్క్ ధరించాలని తెలిపింది. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని.. ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఐసోలేషన్ నుంచి పది రోజుల తర్వాత బయటకు రావొచ్చని.. చివరి 3 రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలతో ఇప్పటికే దేశం మొత్తం అతలాకుతలమవుతున్న సమయంలో థర్డ్ వేవ్ తప్పదంటూ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు డాక్టర్ కే విజయరాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతదేశం లో సెకండ్ వేవ్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే.. కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఒకసారి పునరాలోచించుకోవాలని.. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. థర్డ్ వేవ్ నాటికి వైరస్ మరింతగా మారవచ్చని, భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఎక్కువని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని విజయరాఘవన్ సూచించారు.