నీట్-యూజీ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్
నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను పోలీసులు అరెస్ట్ చేశారు
By Knakam Karthik
నీట్-యూజీ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్
నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ముఖియాను అరెస్టు చేసినట్లు బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం (EOU) ADG నయ్యర్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. “ఒక రహస్య సమాచారం ఆధారంగా, EOU మరియు పాట్నా STF సంయుక్త బృందం సగుణ మోర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, అక్కడ దాక్కున్న సంజీవ్ ముఖియాను అరెస్టు చేసింది. గత సంవత్సరం NEET-UG పేపర్ లీక్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు” అని ఖాన్ చెప్పారు.
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024 (NEET UG-2024)’లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన కుట్రదారుగా సంజీవ్ ముఖియా పేరు వినిపించింది. ఈ వివాదం నేపథ్యంలో అతడు పరారయినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల బిహార్ ప్రభుత్వం సంజీవ్‌పై రూ.3లక్షల నజరానా ప్రకటించింది. ఈక్రమంలోనే అతడు పట్నాలోని ఒక అపార్టుమెంట్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అతడిని అరెస్టు చేశారు. ముఖియా అరెస్టుతో పేపర్ లీక్‌కు కారకులైన మరింతమంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బిహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ తొలుత సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పని చేసేవాడు. అక్కడ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్ బ్రాంచ్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బిహార్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. సంజీవ్ ముఖియా పేరు ప్రధానంగా బయటకొచ్చింది. కాగా.. సంజీవ్ కుమారుడు శివ్‌కుమార్‌కూ ఈ వ్యవహారంలో హస్తం ఉన్నట్లు తేలింది.