ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయ్: జేపీ నడ్డా
ఎన్డీఏ పరిధి కొన్నాళ్లుగా పెరుగుతూనే వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
By Srikanth Gundamalla Published on 17 July 2023 8:20 PM ISTఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయ్: జేపీ నడ్డా
ఒక వైపు యూపీఏ కూటమి రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మిగిలి ఉండగానే ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నాయి. ఈసారి అయినా అధికారంలోకి రావాలని యూపీఏ పావులు కదుపుతుంటే.. ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. తాజాగా యూపీఏ, ఎన్డీఏ కూటములు సమావేశాలు నిర్వహిస్తుండటంతో రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. విపక్షాలన్నీ ఏకమై 26 పార్టీలు 2024 మోదీ సర్కార్‌ను గద్దె దించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ బలం ఏమాత్రం తగ్గలేదని.. ఎన్డీఏ సమావేశానికి 36 పార్టీలు వస్తున్నాయంటూ చెప్పారు. ఏడాది మిగిలి ఉండగానే జాతీయ కూటములు శంఖారావాన్ని పూరిస్తున్నాయి.
ఎన్డీఏ పరిధి కొన్నాళ్లుగా పెరుగుతూనే వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గత తొమ్మిదేళ్లుగా ఎంతో మంది ఎంతో మంది ప్రశంసలు అందుకున్న ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని అందరం చూశామని అన్నారు. మోదీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమిని దేశానికి సేవ చేసేందుకు, బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా జేపీ నడ్డా అభివర్ణించారు.
ప్రతిపక్షాల కూటమి యూపీఏ మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏర్పడిందని జేపీ నడ్డా విమర్శించారు. ఎన్డీఏ నుంచి వెళ్లిన వారు కూడా తిరిగి మళ్లీ వస్తున్నారని అన్నారు. తమ పాలనలో అవినీతి ఏమాత్రం ఉపేక్షించలేదని, కరోనాను కట్టడి చేయడంలో మోదీ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. లబ్ధిదారులకు అన్ని పథకాలు అందజేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రూ.28 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేశామని జేపీ నడ్డా తెలిపారు.
ఎన్డీఏ కూటమికి రావాలని తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. ఇప్పటికే పవన్ ఢిల్లీ చేరుకున్నారు. టీడీపీ మాత్రం ఆహ్వానం రాలేదు. ఈ క్రమంలో పొత్తుపై ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.