జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోని లుగు పర్వత పాదాల వద్ద పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందానికి నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. భద్రతా బలగాల బృందానికి డీఐజీ సురేంద్ర కుమార్ ఝా, ఎస్పీ మనోజ్ స్వర్గియారీ, ఇతర అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ 209 కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా), జార్ఖండ్ జాగ్వార్, సీఆర్‌పీఎఫ్ సైనికులు జాయింట్ ఆపరేషన్ అని అధికారులు తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది నక్సలైట్లు మరణించారు. రెండు INSAS రైఫిల్స్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (SLR), AK47, ఒక పిస్టల్‌తో సహా అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. కోటి రూపాయల రివార్డు ఉన్న వివేక్, 25 లక్షల రూపాయల రివార్డుతో ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అరవింద్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. లుగు పర్వతం దిగువన ఉన్న చోర్గావ్ ముండటోలి సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దం విని తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచినట్లు పేర్కొన్నారు. బయటకు వచ్చేసరికి చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.