హనుమాన్ చాలీసా వివాదం.. ఎట్టకేలకు నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్
Navneet and Ravi Rana Granted Bail By Mumbai Sessions Court.అమరావతి ఎంపీ నవనీత్ రానా, ఆమె భర్త రవి రానాలకు పెద్ద
By తోట వంశీ కుమార్ Published on 4 May 2022 12:37 PM ISTఅమరావతి ఎంపీ నవనీత్ రానా, ఆమె భర్త రవి రానాలకు పెద్ద ఊరట లభించింది. ఎట్టకేలకు వారికి బెయిల్ లభించింది. బుధవారం ముంబయి సెషన్స్ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మత హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన దేశద్రోహం కేసులో మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే రవి రాణాకు బెయిల్ మంజూరైంది. ఇద్దరూ చెరో 50 వేల రూపాయల మేర ఒకటి కంటే ఎక్కువ పూచీ కత్తులు సమర్పించి బెయిల్ తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
బెయిల్‌పై ఉన్న సమయంలో మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడరాదని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో పోలీసులకు సహకరించాలని తెలిపింది. ఇక నవనీత్ రానా, ఆమె భర్త రవి రానాలను పోలీసులు ప్రశ్నించాలనుకుంటే.. 24 గంటల ముందే నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం నవనీత్ రానా దంపతులు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని ఎంపీ నవనీత్ రాణా గత నెలలో సవాల్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు హనుమాన్ చాలీసా చదువుతానని ఆమె అనడం శివసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు ఏప్రిల్ 23న నవనీత్ రాణా ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు.